కందనూలు, వెలుగు : రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను అందిపుచ్చుకొని సాగు ఖర్చులను తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి పాలెంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా, రైతు-శాస్త్రవేత్తల సమావేశం, వ్యవసాయ ప్రదర్శనను రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు ఏవీఎన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేల పరీక్షలు చేయించి భూసారానికి తగినట్లు ఎరువులు వాడాలని, యాంత్రీకరణతో పాటు సూక్ష్మ సాగునీటి పద్ధతులు పాటించాలని కోరారు. కేవలం ఉత్పత్తిపైనే కాకుండా నాణ్యత, ప్రాసెసింగ్, మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టిసారించి రైతులు అదనపు ఆదాయం పొందాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, ఏడీఆర్ డాక్టర్ కృష్ణ, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
